సౌర శక్తి పై అవగాహన

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    సౌర శక్తి పై అవగాహన                

                                                                                                                                                                                                                                                     

                   గజం నేలపై పడే  సౌరశక్తితో మీరు ఏమేం చేయవచ్చో తెలుసా? మీ ఇంట్లోని మిక్సీని వాడుకోవచ్చు.                

                                                                                             
                             
                                                       
           
 

సూర్యుడే దిక్కూ... మొక్కూ!

 

గజం నేలపై పడే  సౌరశక్తితో మీరు ఏమేం చేయవచ్చో తెలుసా? మీ ఇంట్లోని మిక్సీని వాడుకోవచ్చు. లేదంటే... టీవీలో మీకిష్టమైన ప్రోగ్రామ్ చూడటంతోపాటు... ఫ్యాన్లు, బల్బులు ఆన్  చేసేసుకోవచ్చు. సూర్యుడికి అంత శక్తే ఉంటే.. కరెంటు కష్టాలు ఎందుకన్నదేనా మీ సందేహం..? అయితే చదివేయండి మరి...

 

భూమ్మీద బతికే  అన్ని ప్రాణులకు శక్తిని అందించేది సూర్యుడేనని ఒక నమ్మకం. దీని మాటెలా ఉన్నా... ఒక్కో గజం నేలపై పడే సూర్యకిరణాల్లోని  శక్తి 1361 వాట్ల విద్యుత్తుకు సమానమని అంచనా.  కాకపోతే సూర్యకిరణాల్లో సగం మోతాదును వాతావరణం శోషించుకుంటుంది... అంతరిక్షంవైపు తిరిగి వెళ్లిపోతుంది. మిగిలిన 700 వాట్లు కూడా తక్కువేమీ కాదు.  అంతెందుకు.... కేవలం 14.5 సెకన్ల కాలం భూమ్మీద పడే సూర్యశక్తితో ప్రపంచ ప్రజలందరూ ఏడాదిపాటు  కరెంటు కోతల్లేకుండా గడిపేయవచ్చునంటే  ఆశ్చర్యమే కదా? అయినా సరే.. చాలా తక్కువ మంది మాత్రమే సౌరశక్తిని వాడుతున్నారు. ఎందుకు?

 

ధర ఎక్కువగా ఉండటం  ఒక కారణమైతే..,. అవగాహన లేమి రెండోది. ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహకాలు లేకపోవడం మరో  అడ్డంకి. ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం... పదేళ్ల క్రితంతో పోలిస్తే సౌరశక్తి ఘటకాలు (సోలార్ ప్యానెల్స్) రేట్లు దాదాపు 90 శాతం వరకూ తగ్గాయి. అయినా కేవలం ఐదువాట్ల సోలార్ లాంతరు  ఖరీదు వెయ్యి రూపాయల వరకూ ఉంది. ఒక కుటుంబం  మొత్తానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 1.5 కిలోవాట్ల వరకూ విద్యుత్తు  అవసరమవుతుందనుకుంటే ఇందుకోసం దాదాపు  రెండు లక్షల వరకూ (బ్యాటరీలు, ఇన్వర్టర్, సోలార్ ప్యానెళ్లు ఇతర పరికరాలు కలిపి) ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.  ఇంత మొత్తం పెట్టుబడి పెడితే విద్యుత్తుబిల్లు నెలకు  వందల్లో మాత్రమే మిగులుతుంది. దీంతో వినియోగదారులు ఈ టెక్నాలజీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సోలార్‌ప్యానెళ్లు  భారీసైజులో నిర్ణీత సైజులో ఉండటం వల్ల స్థలాభావం కూడా ఒక అడ్డంకి అవుతోంది.

 

సౌరశక్తికి  ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర కొత్త, సంప్రదాయేతర ఇంధనవనరుల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టినా వాటిల్లోని  లోటుపాట్లు లక్ష్యసాధనకు సహకరించడం లేదు. కేంద్ర  ప్రభుత్వం, నాబార్డ్‌లు వేర్వేరుగా 30 నుంచి 40 శాతం సబ్సిడీలు ఇస్తున్నాయి. పది శాతం వరకూ వినియోగదారుడు డిపాజిట్ చేస్తే మిగిలిన మొత్తాన్ని  బ్యాంకు రుణంగా అందిస్తుంది. 60 నెలలపాటు వాయిదాల  రూపంలో తిరిగి చెల్లించవచ్చు. వందవాట్ల సోలార్‌ప్యానెల్ అనుబంధ పరికరాలను కొనుగోలు చేశామనుకుంటే దీనికోసం  వినియోగదారుడు రూ.3 వేల వరకూ డిపాజిట్ చేయాలి. రూ.13 వేల వరకూ బ్యాంక్ రుణం ఉంటుంది. నెలకు రూ.300 చొప్పున చెల్లిస్తూండాలి. వందవాట్ల  ప్యానెల్‌తో ఇంటి అవసరాలు తీరతాయా? అంటే కచ్చితంగా తీరవు. ఫలితంగా కరెంటు బిల్లులో తగ్గేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక కిలోవాట్ మోడల్‌ను తీసుకుంటే  బ్యాంకు వాయిదా రూ.2 వేల నుంచి రూ.2500 వరకూ ఉంటుంది. మూడు నాలుగేళ్లకు ఒకసారి  బ్యాటరీలను మార్చుకోవాల్సి రావడం అదనపు భారం.

 

ప్రత్యామ్నాయం  లేదా?

 

నేలపై పడే మొత్తం  సౌరశక్తిని విద్యుత్తుగా మార్చగల టెక్నాలజీ, సోలార్ ప్యానెళ్లు అందుబాటులో ఉంటే అసలు సమస్యే ఉండకపోను. మార్కెట్‌లో లభించే సోలార్ ప్యానెళ్లు సౌరశక్తిలో 15 నుంచి 20 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం ముంచుకొస్తున్న  నేపథ్యంలో సంప్రదాయేతర ఇంధన వనరులపై మరీ ముఖ్యంగా  సౌరశక్తిపై ప్రపంచవ్యాప్తంగా విస్తత పరిశోధనలు జరుగుతున్నాయి. సోలార్ ప్యానెళ్ల సామర్థ్యాన్ని 40 శాతం వరకూ పెంచే సరికొత్త పదార్థ మిశ్రమాన్ని ఇటీవలే గుర్తించారు.  నానోటెక్నాలజీ సాయంతో సోలార్ ప్యానెళ్ల ద్వారా క్షణాల్లో నీటిఆవిరి తయారు చేసి... తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు, సూర్యుడి నుంచి వెలువడే వేడిని ఒకదగ్గరకు కేంద్రీకరించి... ఉప్పులాంటి  లవణాల్లో నిల్వచేసి అవసరమైనప్పుడు వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు భవనాల గోడల్లా వాడే దళసరి అద్దాలనే పారదర్శక సోలార్ ప్యానెల్స్‌గా  మార్చే దిశగా జరగుతున్న ప్రయత్నాలు కూడా  ఒక కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే మనమంతా పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని  సౌరవిద్యుత్తును వాడటం తథ్యమే అనిపిస్తుంది. అంతవరకూ మనం చేయగలిగిందల్లా... వేచి చూడటమే!

 

పత్యేకంగా శుద్ధి  చేసిన సిలికాన్‌ను రెండు కాంటాక్ట్ ప్లేట్ల మధ్య బంధిస్తారు. ఫ్రంట్, బ్యాక్ కాంటాక్ట్‌లు ధన,రుణ ఆవేశాలతో ఉంటాయి.

 

ఎన్ టైప్  సెమీకండక్టర్‌లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటూ రుణావేశంతో ఉంటుంది. పీటైప్ సెమీ  కండక్టర్ మాత్రం ధనావేశంతో ఉంటుంది.

 

ఎలక్ట్రాన్లు పీ  నుంచి ఎన్ వైపు ప్రయాణించేటప్పుడు అక్కడ ఒక విద్యుత్ క్షేత్రమేర్పడి కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే ఎన్‌వైపు  వెళ్లేలా చేస్తుంది.సూర్యరశ్మి ఫొటోవోల్టాయిక్  సెల్‌ను తాకినప్పుడు సెమీకండక్టర్ పదార్థంలోని అణువుల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఉత్తేజితమవుతాయి.ఈ ఉత్తేజిత ఎలక్ట్రాన్లు పీ-ఎన్ జంక్షన్‌లోని  విద్యుత్ క్షేత్రాన్ని తాకినప్పుడు ఎన్‌టైప్ సెమీకండక్టర్‌వైపు ఆ తరువాత ఫ్రంట్ కాంటాక్ట్ నుంచి ప్రయాణించడం మొదలవుతుంది.

 

సోలార్ ప్యానెల్  లేదా ఫొటో వోల్టాయిక్ సెల్స్‌ను సిలికాన్ వంటి అర్ధ వాహకాలతో తయారు చేస్తారు. సిలికాన్‌పై  సూర్యకిరణాలు పడినప్పుడు అణువుల్లోని  ఎలక్ట్రాన్లు ఉత్తేజితమై ప్రవహిస్తాయి. ఎలక్ట్రాన్ల  క్రమ ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటాం.

 

ఆధారము: సాక్షి

 
                     
                                       
                             
       
     
                       
 
                                                     
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions